Bandi Sanjay: కేసీఆర్ కు 10 ప్రశ్నలు సంధించిన బండి సంజయ్.. జవాబు చెప్పాలని డిమాండ్!

Bandi Sanjay poses 10 questions to KCR
  • నెల రోజులు పూర్తి చేసుకున్న బండి సంజయ్ పాదయాత్ర
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ కొనసాగుతున్న పాదయాత్ర
  • బాధ్యతగల పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర నెల రోజులను పూర్తి చేసుకుంది. మరో నాలుగు రోజులలో పాదయాత్ర ముగియనుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ లపై విమర్శలు గుప్పిస్తూ ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ కు ఆయన 10 ప్రశ్నలను సంధించారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కు బండి సంజయ్ సంధించిన ప్రశ్నలు ఇవే:
  • కేసీఆర్ జమానా అవినీతీ ఖజానా అని సకల జనులు ఘోషిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?
  • మీరు నివసిస్తున్న ప్రగతి భవన్ అవినీతి భవన్ గా, తెలంగాణ ద్రోహులకు నిలయంగా మారిందనేది వాస్తవం. దీనికి మీ సమాధానం ఏమిటి?
  • దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కేసీఆర్ అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?
  • 2014లో సీఎం అయ్యే సమయానికి మీవి, మీ కుటంబసభ్యుల ఆస్తులు ఎంత? ఇప్పుడున్న ఆస్తులు ఎంత? మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా?
  • పాలమూరు-రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టులు, ప్రభుత్వ భూముల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. వీటికి సంబంధించిన ఫైల్స్ అఖిలపక్షం ముందు పెట్టి బహిరంగంగా చర్చించడానికి మీరు సిద్ధమా?
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా? లేదా? దీనికి మీ సమాధానం ఏమిటి?
  • ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను అవినీతి సొమ్ముతో మీరు సంతలో పశువుల్ని కొన్నట్టు కొనలేదా?
  • బంగారు తెలంగాణ లక్ష్యమని చెప్పిన మీరు... అక్రమ మార్గాల ద్వారా కోట్లు కొల్లగొట్టి మీ కుటుంబాన్ని, మీ బంధువులను, మీ పార్టీ నేతలను బంగారుమయం చేశారా? లేదా? ఇదే సమయంలో ప్రజలను బికారులుగా మార్చిన ఘనత మీది కాదా?
  • మీరు సీఎం అయిన తర్వాత ఓటుకు నోటు పథకాన్ని ప్రవేశపెట్టి... సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికల్లో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న మాట నిజం కాదా?
  • మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఇసుక, డ్రగ్స్, లిక్కర్, భూకబ్జా దందాలపై దర్యాప్తు జరిపించి అవినీతి, అక్రమాలు జరగలేదని మీరు నిరూపించగలరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బాధ్యతగల పార్టీగా రేపు మరిన్ని ప్రశ్నలను సంధిస్తామని చెప్పారు.
Bandi Sanjay
BJP
KCR
TRS
Questions
Pada Yatra

More Telugu News