అమెజాన్ ప్రైమ్ దిశగా అడుగులు వేస్తున్న 'దృశ్యం 2'

28-09-2021 Tue 11:15
  • భారీ హిట్ కొట్టిన 'దృశ్యం'
  • విడుదలకి రెడీ అయిన 'దృశ్యం 2'
  • థియేటర్లకు రానుందంటూ టాక్ 
  • ఓటీటీకి వెళ్లనుందనే ప్రచారం 
Drushyam 2 will release in OTT
తెలుగులో ఆ మధ్య వచ్చిన 'దృశ్యం' భారీ విజయాన్ని సాధించింది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆడపిల్లల తండ్రిగా వెంకటేశ్ పోషించిన 'రాంబాబు' పాత్ర ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా 'దృశ్యం 2' రూపొందింది. మలయాళ మూలకథను తెరకెక్కించిన జీతూ జోసెఫ్, ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఆంటోని పెరంబవూర్ .. రాజ్ కుమార్ సేతుపతితో కలిసి సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా థియేటర్లకు రానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కానీ ఈ సినిమాను ఓటీటీకి ఇవ్వనున్నారనేది తాజా సమాచారం. 'నారప్ప' మాదిరిగానే 'దృశ్యం 2' కూడా అమెజాన్ ప్రైమ్ కే వెళ్లనుందని అంటున్నారు.

దసరా తరువాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ కానుందని చెప్పుకుంటున్నారు. మలయాళ 'దృశ్యం 2' కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చిన విషయం తెలిసిందే. 'దృశ్యం' సినిమా ఎక్కడైతే పూర్తయిందో, అక్కడి నుంచే సీక్వెల్ మొదలవుతుంది. మలయాళంలో మొదటి భాగానికి మించిన రెస్పాన్స్ సీక్వెల్ కి వచ్చిన సంగతి తెలిసిందే.