Kasibhatla Sainath Sharma: బ్రాహ్మణ కార్పొరేషన్ ను జగన్ నిర్వీర్యం చేశారు: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ

  • వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతోంది
  • బ్రాహ్మణ కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు ఇస్తామని జగన్ మాట తప్పారు
  • బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ కార్పొరేషన్ లో చేర్చడం దారుణం
Jagan spoiled Brahmin Corporation says Kasibhatla Sainath Sharma

ఏపీలోని బ్రాహ్మణ కార్పొరేషన్ చుట్టూ వివాదం నెలకొంది. పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్... బీసీ కార్పొరేషన్ కింద ఉండటమే పలు అనుమానాలకు కారణమవుతోంది. బ్రాహ్మణులను బీసీల్లో కలపబోతున్నారే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటిదేమీ జరగడం లేదని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వివరణ ఇచ్చినా వివాదం కొనసాగుతూనే ఉంది.
 
తాజాగా బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని... ఆ హామీని తుంగలో తొక్కడమే కాకుండా... బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.

దేవాదాయశాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ కార్పొరేషన్ లో చేర్చడం అత్యంత దారుణమని అన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని కొనియాడారు. బ్రాహ్మణులపై జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భరోసా యాత్రను చేపడతామని తెలిపారు.

More Telugu News