నాన్ స్టాప్ రెయిన్... హైదరాబాదులో హై అలర్ట్... 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్

27-09-2021 Mon 18:45
  • ఇంకా వరుణుడి గుప్పిట్లోనే హైదరాబాద్
  • మరో నాలుగైదు గంటలు వర్షం తప్పదన్న అధికారులు
  • రహదారులపై వరద పోటు
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
  • పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
High alert for rain hit Hyderabad

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఈ సాయంత్రం నుంచి అతి భారీవర్షం ముంచెత్తుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మాన్సూన్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడిపోసే ప్రయత్నం చేస్తున్నారు.

నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో గత మూడు గంటలుగా భారీ వర్షం పడుతుండడంతో ప్రధాన రహదారులపై వరద పోటెత్తింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా స్థానికులు మ్యాన్ హోల్స్ మూతలు తెరిచారు. మరో నాలుగైదు గంటల పాటు భారీ వర్షం పడుతుందని జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం 040-23202813 నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్ధిపేట, సిరిసిల్ల, జనగామ, పెద్దపల్లి, హన్మకొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.