ఆ స్టయిల్స్ ఇక చాలు.. ఆపండి.. గ‌డ్డాల విషయంలో బార్బర్లకు తాలిబ‌న్ల ఆదేశాలు!

27-09-2021 Mon 13:33
  • ఆప్ఘ‌నిస్థాన్‌లో మ‌ళ్లీ త‌మ తీరు ప్ర‌ద‌ర్శిస్తోన్న తాలిబ‌న్లు
  • కొత్త కొత్త ఆంక్ష‌లు పెడుతోన్న వైనం
  • గ‌డ్డం ట్రిమ్ చేసుకోవ‌డం ఇస్లాం చ‌ట్టానికి విరుద్ధ‌మ‌ని వ్యాఖ్య‌
  • ఇప్ప‌టికే  క్షౌరం చేసేవారికి తాలిబ‌న్ల నోటీసులు
talibans introduces new rules
ఆప్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్లు తాత్కాలిక ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ ఇస్తామ‌ని చెప్పి తాలిబ‌న్లు మ‌ళ్లీ ఎప్ప‌టిలాగే త‌మ తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కొత్త కొత్త ఆంక్ష‌లు పెడుతున్నారు. హెల్మాండ్ ప్రావిన్స్‌లో క్షౌరం చేసే దుకాణాల‌కు వెళ్లి.. స్థానికుల‌కు స్టయిల్‌గా గ‌డ్డాలు ట్రిమ్ చేయ‌డాన్ని ఆపేయాల‌ని ఆదేశించారు. ముఖ్యంగా 'అమెరికా స్టయిల్స్ ఇక చాలు ఆపండి' అంటూ ఆర్డర్ వేశారు.

అలా ట్రిమ్ చేసుకోవ‌డం ఇస్లాం చ‌ట్టానికి విరుద్ధ‌మ‌ని చెప్పారు. ఇప్ప‌టికే క్షౌరం చేసేవారికి తాలిబ‌న్లు నోటీసులు పంపారు. అంతేకాదు, త‌మ క‌ళ్లుగ‌ప్పి ఇస్లాంకు విరుద్ధంగా షేవింగ్ చేసే వారిని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకునేందుకు తాలిబ‌న్లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

విదేశీయుల్లా గ‌డ్డాలు పెంచ‌డాన్ని మానుకోవాల‌ని చెప్పారు. మ‌రోవైపు కాబూల్‌లోనూ తాలిబ‌న్లు ఇదే ప‌నిచేశారు. ప్ర‌జా సంక్షేమం, ఆర్థికాభివృద్ధిపై తాలిబ‌న్లు దృష్టి పెట్ట‌కుండా ఇటువంటి విష‌యాల‌పై దృష్టి సారిస్తుండ‌డం గ‌మ‌నార్హం.