Anantapur District: అనంతపురం జిల్లాలో 16 టన్నుల బంగారు నిక్షేపాలు.. టన్నుమట్టిలో 4 గ్రాముల పసిడి

16 tonnes of gold mines in anantapur dist
  • బొక్సంపల్లి, జౌకుల పరిధిలో బంగారు నిక్షేపాలు
  • 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో 16 టన్నుల నిల్వలు
  • కాంపోజిట్ లైసెన్స్ కోసం త్వరలో ఈ-వేలం
రతనాల సీమ రాయలసీమలో భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో 16 టన్నుల వరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన ఖనిజాన్వేషణ విభాగం కాంపోజిట్ లైసెన్స్ జారీకి రెడీ అవుతోంది. జిల్లాలోని రామగిరిలో గతంలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) గనులు ఉండగా, 2001 నుంచి అక్కడ తవ్వకాలు నిలిపివేశారు. ఇప్పుడు ఈ మైన్స్‌కు సమీపంలో రెండు చోట్ల, రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండు చోట్ల, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో ఆరు చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. ఈ పది ప్రాంతాల్లో 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు పేర్కొన్నారు.

 పైన పేర్కొన్న ప్రాంతాల్లో 50 మీటర్ల నుంచి దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. టన్నుమట్టిలో నాలుగు గ్రాములు ఉంటుందని, జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలో రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నుల నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణ కోసం కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వనున్నారు. దీని ప్రకారం.. ఒక్కో వ్యక్తి లేదంటే సంస్థకు వెయ్యి హెక్టార్ల వరకు అన్వేషించుకునేందుకు లైసెన్స్  ఇస్తారు. పూర్తిస్థాయిలో నిక్షేపాలు గుర్తిస్తే మైనింగ్ లీజు కేటాయిస్తారు. త్వరలోనే ఇందుకు ఈ-వేలం నిర్వహిస్తారు.
Anantapur District
Gold Mines
Boksampalli
Roddam

More Telugu News