పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌తో సన్నిహితంగా కడియం సీఐ.. వీఆర్‌కు పంపిన అధికారులు

27-09-2021 Mon 08:23
  • రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఘటన
  • తీవ్రంగా పరిగణించిన డీఐజీ కార్యాలయం
  • కడియం ఇన్‌చార్జ్ సీఐగా రాజమహేంద్రవరం రెండో పట్టణ సీఐ రాంబాబు
DIG sentKadiam CI Sridhar Kumar To VR

రాత్రివేళ పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఓ సీఐ మహిళా కానిస్టేబుల్‌తో సన్నిహితంగా మెలగడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి వేకన్సీ రిజర్వ్ (వీఆర్)కు పంపారు. తూర్పుగోదావరి జిల్లా కడియం సీఐ కె.శ్రీధర్‌కుమార్ రాత్రివేళ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌తో సన్నిహితంగా మెలిగినట్టు ఆరోపణలున్నాయి.

ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఏలూరు రేంజ్ డీఐజీ కార్యాలయం నిన్న ఆయనను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలిందని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్‌రావు తెలిపారు. ఈ విషయమై ఎస్పీ నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉందన్నారు. అప్పటి వరకు ఆయన వీఆర్‌లోనే ఉంటారని పేర్కొన్నారు. అలాగే, రాజమహేంద్రవరం రెండో పట్టణ సీపీఎస్ సీఐ రాంబాబును కడియం ఇన్‌చార్జ్‌ సీఐగా నియమించినట్టు తెలిపారు.