ప్రేమించి పెళ్లాడాడు.. అనుమానంతో భార్యను చంపేసి.. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు!

27-09-2021 Mon 07:36
  • హైదరాబాద్ శివారులోని నిజాంపేటలో ఘటన
  • ప్రేమించి పెళ్లి చేసుకున్న వారం రోజుల నుంచే వేధింపులు
  • భార్య గొంతు కోసి ఆపై ఆత్మహత్యాయత్నం
Husband slits wife throat and attempted suicide in Hyderabad

పెళ్లై నెల రోజులు కూడా కాకుండానే భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి సమీపంలోని దేవునిపల్లెకు చెందిన సుధారాణి (22), కామారెడ్డిలోని శ్రీరాంనగర్‌కు చెందిన కిరణ్ కుమార్ ప్రేమించుకోగా, ఆగస్టు 27న పెద్దలు వీరి పెళ్లి జరిపించారు. అనంతరం నిజాంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం మొదలుపెట్టారు.

శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కుమార్తెను చూసేందుకు సుధారాణి తల్లిదండ్రులు అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. పలుమార్లు తలుపు తట్టినా తీయకపోవడంతో కుమార్తెకు, అల్లుడికి ఫోన్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో ఇరుగురుపొరుగు సాయంతో తలుపులుబద్దలు గొట్టి లోపలికి వెళ్లి చూసి హతాశులయ్యారు.

పడకగదిలో సుధారాణి రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించింది. ఆమె మెడపైనా, ఇతర శరీర భాగాలపైనా బ్లేడుతో కోసిన గాయాలున్నాయి. అదే గదిలోని బాత్రూములో కిరణ్ కుమార్ కూడా తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిరణ్‌ను ఆసుపత్రికి తరలించారు. భార్యను హత్య చేసిన అనంతరం అతడు ఆత్మహత్యకు యత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది.

కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న కిరణ్ కుమార్ వారం రోజుల నుంచే భార్యపై అనుమానంతో వేధించడం ప్రారంభించాడని, ఈ క్రమంలో ఓసారి ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు యత్నించాడని చెబుతున్నారు. వివాహానికి నాలుగు నెలల ముందు తమ కుమారుడి తలకు గాయమైందని, అప్పటి నుంచే ఇలా ప్రవర్తిస్తున్నాడని నిందితుడి తండ్రి పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.