CSK: ఉత్కంఠ పోరులో కోల్ కతాపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

Chennai beat KKR in thriller clash
  • చివరి బంతికి నెగ్గిన చెన్నై
  • 8 వికెట్లు కోల్పోయి లక్ష్యఛేదన
  • జడేజా మెరుపుదాడి
  • 8 బంతుల్లో 22 రన్స్
  • 2 ఫోర్లు, 2 సిక్సులు బాదిన జడేజా
ఐపీఎల్ లో నేడు సిసలైన మ్యాచ్ జరిగింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 172 పరుగుల విజయలక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో 142 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకున్న చెన్నై ఓటమి బాటలో పయనిస్తున్నట్టుగా కనిపించింది. అయితే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు బాది 22 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో చెన్నై గెలుపునకు 4 పరుగులు అవసరం కాగా, సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే చివరి బంతికి దీపక్ చహర్ సింగిల్ తీయడంతో చెన్నై విజయంతో మురిసింది.

అంతకుముందు, లక్ష్యఛేదనలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (40), డుప్లెసిస్ (43) తొలి వికెట్ కు 8.2 ఓవర్లలో 74 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వన్ డౌన్ లో వచ్చిన మొయిన్ అలీ 32 పరుగులు చేశాడు. అయితే రాయుడు (10), రైనా (11), ధోనీ (1) నిరాశపరిచారు. జడేజా విజృంభణతో చెన్నై ఓటమి ప్రమాదం తప్పించుకుంది. కోల్ కతా బౌలర్లలో నరైన్ 3, ప్రసిద్ధ్ 1, ఫెర్గుసన్ 1, వరుణ్ చక్రవర్తి 1, రస్సెల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది.

కాగా, ఐపీఎల్ లో నేడు రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
CSK
KKR
Win
IPL

More Telugu News