4 నెలల్లో 202 ఎన్నికల హామీలు నెరవేర్చాం: తమిళనాడు సీఎం స్టాలిన్

26-09-2021 Sun 13:30
  • మొత్తం 505 ఎన్నికల హామీలు ఇచ్చిన డీఎంకే
  • భారత్‌లో మరే ప్రభుత్వమూ ఇంత వేగంగా హామీలు నెరవేర్చలేదు
  • ట్విట్టర్‌లో వీడియో సందేశం ఇచ్చిన సీఎం స్టాలిన్
fulfilled 202 election promises in four months says CM Stalin
ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 నెలల్లోనే తాము ఎంతో చేశామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. తను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాడే అతి ముఖ్యమైన 5 బిల్లులపై సంతకాలు చేశానని ఆయన చెప్పారు. వాటిలో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు దారులందరికీ రూ. 4 వేల కరోనా సహకారం అందించడం కూడా ఒకటని తెలియజేశారు.

తమ డీఎంకే పార్టీ ఎన్నికల్లో మొత్తం 505 హామీలు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటైన 4 నెలల్లో వీటిలో 202 హామీలు నెరవేర్చామని సీఎం తెలిపారు. ఈ మేరకు వివరాలు చెబుతూ ట్విట్టర్‌లో వీడియో సందేశం షేర్ చేశారు. భారతదేశంలో మరే ప్రభుత్వమూ ఇంత వేగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని స్పష్టం చేశారు.

అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను కలుస్తానని ఆయన అన్నారు. ప్రజలకు అత్యున్నత సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.