Andhra Pradesh: ఆ పుస్తకం చదువుతుంటే నా కళ్లలో నీళ్లు ఆగలేదు: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

CJI Response On Dr Nori Dattatreyudu Self Biography Odigina Kaalam
  • ఇవాళ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆత్మకథ ‘ఒదిగిన కాలం’ ఆవిష్కరణ
  • రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేసిన సీజేఐ
  • అందరి హృదయాలను హత్తుకుంటుందన్న జస్టిస్ రమణ
ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జీవితం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. సమాజానికి, ప్రత్యేకించి తెలుగు వారికి ఆయన ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. ఎన్నెన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఆయన ‘ఒదిగిన కాలం’ పేరిట పుస్తక రూపంలో తీసుకురావడం సంతోషంగా ఉందని, కానీ, పుస్తకావిష్కరణకు తాను రాలేకపోతున్నందుకు మాత్రం విచారంగా ఉందని పేర్కొన్నారు. ఇవాళ నోరి దత్తాత్రేయుడు ఆత్మకథ ‘ఒదిగిన కాలం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ తన సందేశాన్ని పంపించారు.

తాను ఇటీవలి కాలంలో చాలా ఆసక్తిగా పూర్తిగా చదివిన పుస్తకం ‘ఒదిగిన కాలం’ అని చెప్పారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే నానుడిని అందరికీ అర్థం అయ్యేలా చెప్పే పుస్తకమే కాకుండా.. గొప్ప విజ్ఞానాన్ని కూడా ఈ పుస్తకం అందిస్తుందన్నారు. బాల్యంలో నోరి దత్తాత్రేయుడు ఎదుర్కొన్న కష్టాలు, ఆయన తల్లి చేసిన త్యాగాలు, బంధు మిత్రుల ప్రోత్సాహం గురించి చదువుతుంటే తన కళ్లల్లో నీళ్లు ఆగలేదని చెప్పారు. ప్రతి ఒక్కరి హృదయాన్ని పుస్తకం హత్తుకుంటుందని జస్టిస్ రమణ తెలిపారు.

భారత్ లాంటి వర్ధమాన దేశాలకు వైద్య రంగానికి సంబంధించి విలువైన సందేశం ఉందని ఆయన వివరించారు. అమెరికా లాంటి దేశాలు వైద్య రంగంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి, టెక్నాలజీ వంటి వాటిని విడమరిచి చెప్పారన్నారు. నోరి దత్తాత్రేయుడు తెలుగువాడిగా జన్మించడం అందరం చేసుకున్న పుణ్యమని చెప్పారు.
Andhra Pradesh
Telangana
Nori Dattatreyudu
CJI
Justice N.V. Ramana
Odigina Kaalam

More Telugu News