ఆసీస్ టూర్: చివరి బంతికి ఓడిన భారత మహిళల జట్టు

  • చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన ఆసీస్
  • ఫీల్డింగ్ తప్పిదాలతో చివరి బంతికి 3 పరుగుల స్థితి
  • ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరికి కంగారూలదే పైచేయి
Indian team loses on last ball against Australia women team

అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఆస్ట్రేలియా-భారత్ మహిళల క్రికెట్ మ్యాచ్‌లో చివరికి గెలుపు ఆసీస్‌నే వరించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించింది. ఒక దశలో 68/0తో పటిష్ఠంగా నిలిచింది. ఓపెనర్లు స్మృతి మంధాన (86), షెఫాలీ వర్మ (22) తొలి పదిఓవర్లలో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.

అయితే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ (8), యస్తికా భాటియా (3) నిరాశపరిచారు. రిచా ఘోష్ (44), దీప్తి శర్మ (23), పూజా వస్త్రకర్ (29), ఝులన్ గోస్వామి (28) రాణించడంతో భారత జట్టు 50 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 275 పరుగుల భారీ స్కోరు చేసింది.

లక్ష్యాన్ని కాపాడుకోవడంలో చివరి వరకూ పట్టుదల చూపించిన భారత జట్టు చివరి ఓవర్లో చతికిలపడింది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు కావలసి ఉండగా వెటరన్ బౌలర్ ఝులన్ గోస్వామి బంతి అందుకుంది. ఫీల్డర్ల తప్పిదాలతో తొలి ఐదు బంతుల్లో 10 పరుగులు వచ్చాయి. చివరి బంతికి 3 పరుగులు అవసరమవగా ఝులన్ ఫుల్‌టాస్ బంతి విసిరింది. దాన్ని నికోలా కేరీ (39) భారీ షాట్‌గా మలచబోయి క్యాచ్ అవుటైంది.

కానీ దాన్ని అంపైర్లు నోబాల్‌గా ప్రకటించారు. దీంతో చివరి బంతికి 2 పరుగులు అవసరం అయ్యాయి. వీటిని పూర్తి చేసిన కేరీ తన జట్టుకు విజయం అందించింది. ఆసీస్ బ్యాట్స్‌వుమెన్స్‌లో ఓపెనర్ బెత్ మూనీ (125), తాహ్లియా మెక్‌గ్రాత్ (79), నికోలా కేరీ రాణించారు. భారత బౌలర్లలో ఝులన్ గోస్వామి 3, మేఘనా సింగ్ 2, దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకున్నారు.

More Telugu News