రోడ్డు ప్రమాదంలో గాయపడిన వాహనదారుడ్ని స్వయంగా ఆసుపత్రిలో చేర్చిన దేవినేని ఉమ

24-09-2021 Fri 21:27
  • ప్రకాశం బ్యారేజిపై ఘటన
  • రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వెంకట్ రెడ్డి
  • అటుగా వస్తున్న దేవినేని ఉమ
  • బాధితుడ్ని ఆసుపత్రిలో చేర్చి డాక్టర్లతో మాట్లాడిన వైనం
Devineni Uma helps accident victim in Vijayawada
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వాహనదారుడి పట్ల టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పెద్దమనసుతో స్పందించారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన శ్యామల వెంకట్ రెడ్డి ప్రకాశం బ్యారేజి మీద బైక్ పై వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో వెంకట్ రెడ్డికి గాయాలయ్యాయి.

అదే సమయంలో మాజీ మంత్రి దేవినేని ఉమ అటుగా వెళుతూ, వెంకట్ రెడ్డి పరిస్థితిని గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపిన ఉమ, వెంకట్ రెడ్డిని తన కారులో తీసుకెళ్లి, విజయవాడ గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అనంతరం, వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఘటనపై సమాచారం అందించారు.