క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేయాలంటున్న చైనా

24-09-2021 Fri 18:09
  • మార్కెట్లో క్రిప్టో లావాదేవీలను పరిగణించలేం
  • బిట్‌కాయిన్, టెథర్ సహా ఏవీ ఫ్లాట్ కరెన్సీ కాదు
  • క్రిప్టో సేవలన్నీ అక్రమ ఆర్థిక చర్యలే : చైనా
China central bank suggests to ban all crypto currency in the market

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న క్రిప్టో కరెన్సీపై డ్రాగన్ దేశం చైనా ఉక్కుపాదం మోపుతోంది. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదని తేల్చి చెప్పిన చైనా దీన్ని తమ దేశంలో నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు చైనా కేంద్రీయ బ్యాంకు తాజాగా ఒక ప్రకటన చేసింది. క్రిప్టో కరెన్సీ సంబంధిత లావాదేవీలన్నీ చట్టవ్యతిరేకమైనవని చైనా కేంద్రీయ బ్యాంకు స్పష్టం చేసింది.

అలాగే ఈ కరెన్సీ లావాదేవీల మనుగడ మార్కెట్‌కు నష్టమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే క్రిప్టో సంబంధిత లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. విదేశీ సంస్థలు చైనీయులకు అందించే క్రిప్టో సేవలు అక్రమమైనవేనని పేర్కొంది. దేశంలో బిట్‌కాయిన్ సహా క్రిప్టో కరెన్సీ మొత్తాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.

కాగా, ప్రపంచంలోని పలు దేశాలు క్రిప్టో కరెన్సీతో లావాదేవీలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్తలైన ఎలన్ మస్క్ వంటి వారు కూడా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత చాలా మంది దీనిపై నమ్మకం పెంచుకున్నారు.

ఈ క్రమంలోనే పలు దేశాలు తమ దేశంలో క్రిప్టో ద్వారా చెల్లింపులు చేయడానికి కూడా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ చైనా మాత్రం ఈ విధానానికి వ్యతిరేకంగా ఉంది. చాలా సార్లు క్రిప్టో కరెన్సీకి వ్యతిరేకంగా గళం వినిపించింది.