'మా' అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎవర్ని గెలిపించినా అది మీ ఇష్టం... ప్రధాన కార్యదర్శిగా మాత్రం నాకే ఓటేయండి: బండ్ల గణేశ్ విజ్ఞప్తి

24-09-2021 Fri 17:44
  • అక్టోబరు 10న 'మా' ఎన్నికలు
  • ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల హోరాహోరీ
  • ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి బయటికి వచ్చిన బండ్ల గణేశ్
  • స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ
Bandla Ganesh appeals for vote in MAA elections

టాలీవుడ్ లో 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల కోలాహలం మరింత పెరిగింది. ఇటీవల ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి వైదొలగిన బండ్ల గణేశ్ 'మా' ప్రధాన కార్యదర్శి పదవి కోసం స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తనను ఓటుతో దీవించాలంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. "ఒకే ఒక్క ఓటు, 'మా' కోసం, మన కోసం, మనందరి కోసం, 'మా' తరఫున ప్రశ్నించడం కోసం" అంటూ ట్వీట్ చేశారు.

"అధ్యక్షుడ్ని, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడ్ని, ఉపాధ్యక్షులను, కోశాధికారిని, సంయుక్త కార్యదర్శులను, కార్యనిర్వాహక సభ్యులను ఎవర్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం... కానీ  'మా' ప్రధాన కార్యదర్శిగా మాత్రం నాకే ఓటేయండి, నన్నే గెలిపించండి" అంటూ బండ్ల గణేశ్ తన పోస్టు ద్వారా కోరారు.

'మా' ఎన్నికలు అక్టోబరు 10న జరగనుండగా, హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కు వేదికగా నిలుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ చేపట్టనున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ప్రధాన పోటీదారులైన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఇప్పటికే తమ ప్యానెళ్లను ప్రకటించడంతో ప్రచారం ఆసక్తికరంగా మారింది.