TTD: సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన టీటీడీ.. ఆందోళనకు దిగిన భక్తులు

  • టోకెన్ల జారీ నిలిపివేయడంతో భక్తుల ఆగ్రహం
  • శ్రీనివాసం వసతి గృహం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • రేపటి నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తామన్న అధికారులు
Tirumala devotees protest at srinivasam guest house

తిరుపతిలో భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయడమే అందుకు కారణం. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాకు చెందిన  భక్తులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు ఇస్తుండగా, ఇకపై అన్ని జిల్లాల భక్తులకు టోకెన్లు పంపిణీ చేస్తామని, అలాగే టోకెన్ల సంఖ్యను 8 వేలకు పెంచుతున్నట్టు అధికారులు ఇటీవల ప్రకటించారు.

తిరుపతిలోని శ్రీనివాసం వసతి గృహం వద్ద శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఇస్తామని పేర్కొన్నారు. దీంతో అక్కడికి చేరుకున్న భక్తులకు నిరాశే ఎదురైంది. టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్టు అధికారులు చేసిన ప్రకటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారిని వెనక్కి పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అయితే, టోకెన్లు ఇచ్చే వరకు వెనుదిరిగేది లేదని భక్తులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాసం వసతి గృహం వద్ద భారీగా మోహరించారు. మరోవైపు, రేపటి నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు ఇస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు.

More Telugu News