ఢిల్లీలో ఆటోపై చెట్టు కూలడంతో మరణించిన ఐదేళ్ల పిల్లాడు

23-09-2021 Thu 17:07
  • దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ప్రమాదం
  • పిల్లాడిని వెంటనే ముకంద్ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • చికిత్స పొందుతూ కన్నుమూసిన చిన్నారి
  • తలకు తీవ్రమైన గాయం కారణంగానే మరణించినట్లు ధ్రువీకరణ
5 year old boy dies after tree fell on auto he was sitting in
ఆటోలో కూర్చొని ఉన్న ఐదేళ్ల పిల్లాడిపై మృత్యువు ఒక చెట్టు రూపంలో దాడి చేసింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. ఇక్కడి ఐపీ ఎక్స్‌టెన్షన్ ఏరియాలో ఓ ఆటోలో బాలుడు కూర్చుని వుండగా, ఒక చెట్టు విరిగి దానిపై పడింది. దాంతో బాలుడి తలకు తీవ్రగాయాలు అవడంతో స్థానికులు అతన్ని దగ్గరలో ఉన్న శాంతి ముకంద్ ఆసుపత్రిలో చేర్పించారు.

అయితే చికిత్స తీసుకుంటూ ఆ పిల్లాడు కన్నుమూశాడు. తలకు తగిలిన తీవ్రమైన గాయాలవల్లే బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ప్రాథమిక దర్యాప్తు చేశారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన ప్రదేశంలో విరిగిన చెట్టుతోపాటు ఆటోకు సంబంధించిన కొన్ని అద్దం ముక్కలు కూడా కనిపించాయి. నిపుణులు ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని పోలీసులు తెలిపారు. ప్రమాదం యాదృచ్ఛికంగానే జరిగినట్లు కనిపిస్తోందని చెప్పారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.