"తెలివైన పిల్లవాడు నరేంద్ర"... బాల్యంలో మోదీ సాహసాలపై ఏపీ బీజేపీ ట్వీట్

23-09-2021 Thu 17:01
  • సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మోదీ
  • దేశ ప్రధాని అయిన వైనం
  • ఏపీ బీజేపీ ఆసక్తికర ట్వీట్
  • బాల్యంలో మోదీ మొసలిని పట్టుకున్నాడని వెల్లడి
AP BJP tweets on PM Modi childhood adventures
ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబ పోషణ కోసం చాయ్ అమ్మిన మోదీ, ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని అయ్యారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ నేడు తెలివైన పిల్లవాడు నరేంద్ర అంటూ ఆసక్తికర ట్వీట్ చేసింది. బాల్యంలో మోదీ సాహస కార్యాలను మరోసారి ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది.

కేవలం ఏడెనిమిదేళ్ల వయసులోనే మోదీ మొసళ్లతో నిండిన సరస్సులో ఈత కొట్టేవాడని వెల్లడించింది. అంతేకాకుండా, ఆ సరస్సులో ఓ మొసలి పిల్లను పట్టుకుని ఇంటికి కూడా తీసుకువచ్చాడని, అయితే ఆయన తల్లి వద్దని చెప్పడంతో తిరిగి ఆ మొసలిని సరస్సులో వదిలిపెట్టాడని ఏపీ బీజేపీ తన ట్వీట్ లో వివరించింది. బాల్యంలో మోదీ ఓ ఆలయ శిఖరంపై జెండా కూడా ఎగురవేశాడని తెలిపింది.

కాగా, ఏపీ బీజేపీ తన ట్వీట్ తో పాటు ఓ ఆసక్తికర చిత్రాన్ని కూడా పంచుకుంది. అందులో నీటిలో దిగిన మోదీ మొసలిపిల్లను పట్టుకోగా, ఒడ్డున ఉన్న మిగతా బాలలు భయాందోళనలకు గురికావడం ఆ చిత్రంలో చూడొచ్చు. అయితే, ఏపీ బీజేపీ చేసిన ఈ ట్వీట్ కు నెటిజన్ల నుంచి వ్యతిరేక దిశలో వ్యాఖ్యలు వస్తున్నాయి.