Bengaluru: బెంగళూరులో మహిళా ప్యాసింజర్ పై అత్యాచారం... క్యాబ్ డ్రైవర్ అరెస్ట్

Cab driver arrested for raping woman passenger in Bangalore
  • నిన్న తెల్లవారుజామున అత్యాచారం చేసిన క్యాబ్ డ్రైవర్
  • ఓ హోటల్ లో పని చేస్తున్న బాధితురాలు
  • ఆమెను కనీసం ముట్టుకోలేదంటున్న క్యాబ్ డ్రైవర్
ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడినా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘోరమే బెంగళూరులో చోటుచేసుకుంది. ఓ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దుండగుడిని అరెస్ట్ చేశారు.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె బెంగళూరులోని ఓ హోటల్ లో పని చేస్తోంది. హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని ఓ అపార్ట్ మెంటులో తన స్నేహితులతో కలిసి గత మంగళవారం రాత్రి ఆమె పార్టీలో పాల్గొంది. పార్టీ తర్వాత మురుగేశపాల్యలో ఉన్న తన అపార్ట్ మెంటుకు వెళ్లడానికి బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుంది. 3.40 గంటలకు క్యాబ్ అక్కడకు వచ్చింది. ఆ తర్వాత ఆమెపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేశాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన పోలీసులు అవళహల్లిలోని ఇంట్లో క్యాబ్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. బతుకుదెరువు కోసం సదరు క్యాబ్ డ్రైవర్ 2019లో బెంగళూరుకు వచ్చాడని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఆమెపై తాను అత్యాచారం చేయలేదని పోలీసు విచారణలో క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. పేమెంట్ విషయంలో ఆమెకు, తనకు మధ్య గొడవ జరిగిందని, తాను ఆమెను కనీసం టచ్ కూడా చేయలేదని తెలిపాడు. మరోవైపు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
Bengaluru
Woman
Rape
Cab Driver

More Telugu News