ఇంకోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే సంగతి చూస్తాం: టీఆర్ఎస్ శ్రేణులకు సీపీఐ నారాయణ వార్నింగ్

22-09-2021 Wed 14:52
  • రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ శ్రేణులు
  • ఇది నీచమైన సంస్కృతి అన్న సీపీఐ నారాయణ
  • దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని సవాల్
CPI Narayana warns TRS cadre for attacking Revanth Reddy house
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న ముట్టడించేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీ ఉన్నప్పటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీసు అధికారులను రేవంత్ ప్రశ్నించారు.

మరోవైపు రేవంత్ ఇంటిపై దాడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. అసలైన డెకాయిట్లు అందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకుల ఇళ్లపై దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. రేవంత్ ఇంటిపై దాడిని అఖిలపక్షం ఖండిస్తోందని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి దాడులకు తెగబడితే సంగతి చూస్తామని హెచ్చరించారు. దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని సవాల్ విసిరారు. ఇలాంటి దాడులు చేసే వారిని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదని చెప్పారు.