విజయ్ దేవరకొండతో కాదు .. చైతూతో శివ నిర్వాణ!

22-09-2021 Wed 10:28
  • విజయ్ దేవరకొండతో చేయవలసిన కథ
  • పాన్ ఇండియా సినిమాలపైనే ఆయన దృష్టి
  • చైతూకు కథ వినిపించిన శివ నిర్వాణ
  • ఆయనపై నమ్మకంతో ఓకే చెప్పిన చైతూ      
Naga Chaitanya in Shiva Nirvana movie
చూస్తుంటే నాగచైతన్య కూడా తన దూకుడు పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'లవ్ స్టోరీ' సినిమా రెడీ అవుతోంది. ఆ తరువాత సినిమాగా ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' చేస్తున్నాడు. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక తాజాగా ఆయన శివ నిర్వాణ వినిపించిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన 'మజిలీ' చేయగా భారీ విజయాన్ని అందుకుంది. అందువలన శివ నిర్వాణపై గల నమ్మకంతో వెంటనే చైతూ ఒప్పుకున్నట్టుగా చెబుతున్నారు. ఇది ముందుగా విజయ్ దేవరకొండకు వినిపించిన కథ అనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న టాక్.

విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ ఒక సినిమా చేయవలసి ఉంది. ఈ విషయాన్ని ఆయా సందర్భాల్లో ఇద్దరూ చెప్పారు కూడా. అయితే ఇకపై పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్న కారణంగా విజయ్ దేవరకొండ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. అందువల్లనే చైతూను శివ నిర్వాణ లైన్లో పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.