New York: న్యూయార్క్ లో రోడ్డు పక్కన నిలబడి పిజ్జా తిన్న బ్రెజిల్ అధ్యక్షుడు.. కారణం ఏంటో తెలుసా?

  • కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండానే యూఎన్ సమావేశానికి
  • టీకా సర్టిఫికేషన్ లేకపోవడంతో రెస్టారెంట్లోకి నో ఎంట్రీ
  • రోడ్డుపై పిజ్జా తింటున్న బోల్సనారో ఫొటోలు వైరల్
Brazil President Jair Bolsanaro eats pizza on side walk photos goes viral

బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సనారో రోడ్డు పక్కనే నిలబడి పిజ్జా తిన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా? కరోనా టీకా తీసుకోనందుకే. ఆది నుంచి కరోనాపై నిర్లక్ష్య ధోరణి చూపుతున్న బోల్సనారో తనకు కరోనా సోకిన విషయాన్ని కూడా స్వయంగా మీడియా సమావేశం పెట్టి వెల్లడించారు.

దీంతో ఆ సమావేశంలో పాల్గొన్న మీడియా ప్రతినిధులు భయపడిపోయారు. ఆ తర్వాత కూడా కరోనాను చూసి భయపడాల్సిన అవసరం లేదని, తాను వ్యాక్సిన్ తీసుకోబోనని ప్రకటించారు. ఆ తర్వాత బ్రెజిల్ ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పటికీ బోల్సనారో మాత్రం టీకా తీసుకోలేదు. ఇప్పుడు న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. దీనిలో పాల్గొనేందుకు బోల్సనారో న్యూయార్క్ చేరుకున్నారు.

అయితే, ఈ సమావేశానికి వచ్చే వివిధ దేశాల ప్రతినిధులు కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని న్యూయార్క్ మేయర్ స్పష్టంగా చెప్పేశారు. ఈ మాటల్ని కూడా బోల్సనారో లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు రాత్రి భోజనం చేసేందుకు బోల్సనారో బృందం రెస్టారెంటుకు వెళ్లింది. కానీ న్యూయార్క్ కరోనా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోని వారిని రెస్టారెంట్లలోకి అనుమతించడం జరగదు.అందుకే బోల్సనారో బృందాన్ని రెస్టారెంట్లోకి రానివ్వలేదు. దీంతో రోడ్డుపక్కనే నిలబడి పిజ్జా తిన్నారు బోల్సనారో. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరలయ్యాయి. అదీ సంగతి!

More Telugu News