Canada: సంపూర్ణ మెజారిటీ రాకపోయినా... కెనడా ప్రధానిగా మళ్లీ ట్రూడూకే అధికారం!

  • సంపూర్ణ మెజారిటీ సాధించలేకపోయిన జస్టిన్ ట్రూడూ
  • లిబరల్స్ కే పట్టం కట్టిన ప్రజలు
  • ఆటుపోట్లు ఎదుర్కొన్నా గెలిచిన ట్రూడూ
Justin Trudeau Wins In Election But Loses Majority

కెనడా ప్రజలు మళ్లీ ఉదారవాద ప్రధానినే ఎన్నుకున్నారు. ‘లిబరల్స్’కే అత్యధిక స్థానాలను కట్టబెట్టారు. మరోసారి దేశ పగ్గాలను జస్టిస్ ట్రూడూకే అప్పగించారు. అయితే, ఆయన పార్టీ సంపూర్ణ మెజారిటీని మాత్రం సాధించలేకపోవడం గమనార్హం. కరోనా వ్యాక్సినేషన్ ను సాఫీగా సాగించేందుకు ఎన్నికలను ఆపేయాలని గత నెలలో ట్రూడూ దేశ ఎన్నికల సంఘాన్ని కోరారు.


అయితే, ఎన్నికల సంఘం ముందుకే వెళ్లింది. ఈ ఐదు వారాల ప్రచారంలో ట్రూడూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మెజారిటీని కోల్పోయారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని అంతా ఫిక్స్ అయిపోయారు. నిన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన జయభేరి మోగించారు. మెజారిటీ రాకపోయినా మళ్లీ దర్జాగా ప్రధాని పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు.

ఈ గెలుపుతో తన కుటుంబంతో కలిసి విక్టోరియా గాలాలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ మహమ్మారి చీకటి రోజుల నుంచి వెలుగుల్లోకి ప్రయాణించేందుకు తనకు మళ్లీ అధికారం అప్పగించారని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు అని ట్రూడూ చెప్పారు.

ఆయన గెలిచినప్పటికీ ప్రజలు ఆయనపై కొంత అసంతృప్తిగానే ఉన్నారు. మహమ్మారి పూర్తిగా తొలగిపోయాకే ఎన్నికలకు వెళ్తామని చెప్పిన ఆయన.. అంతలోనే ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరోనా కట్టడిలో ట్రూడో సగమే మంచిగా పనిచేశారంటున్నారు. మరికొందరు మాత్రం ట్రూడూ బాగా పనిచేశారని చెబుతున్నారు.

కాగా, తమపై (లిబరల్స్) నమ్మకం ఉంచినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు అని ట్రూడూ ట్వీట్ చేశారు. కరోనాపై పోరును ముందుకు తీసుకెళ్తామని, మహమ్మారిపై గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News