Jagan: 'వాణిజ్య ఉత్సవ్-2021'ని ప్రారంభించిన జగన్.. రెండేళ్లలో 10 మెగా ప్రాజెక్టులను ఏర్పాటు చేశామన్న సీఎం

Jagan launches Vanijya Utsav 2021
  • రాష్ట్ర ఎగుమతుల రోడ్ మ్యాప్ విడుదల చేసిన జగన్
  • పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తున్నామన్న సీఎం
  • 10 మెగా ప్రాజెక్టుల ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించామన్న జగన్  
ఎగుమతుల విషయంలో ఏపీని దేశంలోనే తొలి స్థానంలో నిలపడమే లక్ష్యంగా విజయవాడలో ఏర్పాటు చేసిన 'వాణిజ్య ఉత్సవ్-2021'ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రాష్ట్ర ఎగుమతుల రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు. ఎక్స్ పోర్ట్స్ కు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ఈ-పోర్టల్ ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్లాస్టిక్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. దీని తర్వాత శుక్ర, శని, ఆదివారాల్లో జిల్లా స్థాయుల్లో వాణిజ్య ఉత్సవాలు జరుగుతాయి.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారాలను అందిస్తోందని చెప్పారు. గత రెండేళ్లలో ఏపీ ఎగుమతులు 19.43 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. 2020-21లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని చెప్పారు.

ఇక రెండేళ్లలో రూ. 20,390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటి ద్వారా 55 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైయస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ. 13 వేల కోట్ల పెట్టుబడితో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Jagan
YSRCP
Vanijya Utsav 2021

More Telugu News