Amazon: అధికారులకు లంచాలు.. సీరియస్​ అయిన కేంద్రం.. వివరణ ఇచ్చిన అమెజాన్​!

  • అమెజాన్ పై మండిపడిన ఉన్నతాధికారులు
  • వ్యవస్థ మొత్తం లంచంతోనే పనిచేస్తోందని ఆరోపణ
  • తామూ అవకతవకలను సహించబోమన్న అమెజాన్
  • దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి
  • సీబీఐతో విచారణ జరిపించాలని సీఏఐటీ డిమాండ్
Central Government Serious Over Amazon Bribery Allegations

ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మీద లంచం ఆరోపణలపై కేంద్రం ప్రభుత్వం సీరియస్ అయింది. దానిపై దర్యాప్తు చేస్తామని, అవినీతిని సహించబోమని తేల్చి చెప్పింది. ఇటు అమెజాన్ కూడా ఆరోపణలపై స్పందించింది. అవినీతిని తామూ సహించేది లేదని స్పష్టం చేసింది. న్యాయ సేవల ఫీజు కింద భారత్ లోని న్యాయవాదికి అమెజాన్ రెండేళ్లలో రూ.8,500 కోట్లు చెల్లించిందని, ఆ ఫీజు నుంచే ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చారని నిన్న అమెరికాకు చెందిన ఓ వెబ్ సైట్ సంచలన కథనం ప్రచురించింది.

దీనిపై తాజాగా ప్రభుత్వం స్పందించింది. అవినీతి ఏ రూపంలో ఉన్నా సహించబోమని తేల్చి చెప్పింది. ప్రచురితమైన కథనంలో ఏ రాష్ట్రంలో, ఎవరి హయాంలో ఆ అవినీతి జరిగిందో స్పష్టంగా చెప్పలేదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ‘‘న్యాయ ఫీజుల కోసమే అమెజాన్ రూ.8,500 కోట్లకుపైగా ఖర్చు పెడుతోంది. ఆ డబ్బంతా ఎక్కడికిపోతోందో తేల్చాల్సిన సమయం వచ్చింది. వ్యవస్థ మొత్తం లంచం మీదే పనిచేస్తోందన్న విషయం దీన్ని బట్టి అర్థమవుతోంది. వ్యాపారానికి ఇది మంచి పద్ధతి కాదు’’ అని అమెజాన్ పై ఆ సీనియర్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవకతవకలపై తాము కూడా సీరియస్ గానే ఉన్నామని అమెజాన్ వివరణ ఇచ్చింది. దీనిపై తాము కూడా అంతర్గతంగా విచారణ జరిపిస్తామని, కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ప్రస్తుతం ఆరోపణలపై తాము స్పందించబోమని పేర్కొంది. కాగా, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసింది.

ప్రభుత్వ విశ్వసనీయతకు, ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థల్లో ఉన్న లంచం మూలాలను అంతమొందించేందుకు అది దోహదపడుతుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో భాగస్వాములైన అధికారుల పేర్లను బయటపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ కమిషన్ చైర్మన్ గేరీ జెన్స్ లర్ నూ కోరతామంది. కాగా, రూ.24,713 కోట్ల ఫ్యూచర్ డీల్ కు సంబంధించి ప్రస్తుతం రిలయన్స్ తో అమెజాన్ కోర్టులో పోరాడుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News