సారీ వరుణ్... నేను సాయిపల్లవిని చూస్తున్నా అని చెప్పా: చిరంజీవి

19-09-2021 Sun 20:37
  • హైదరాబాదులో లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్
  • హాజరైన చిరంజీవి
  • సాయిపల్లవిపై ప్రశంసలు
  • అద్భుతమైన డ్యాన్సర్ అంటూ కితాబు
Chiranjeevi speech at Love Story unplugged event held in Hyderabad
లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరంగా ప్రసంగించారు. ఈ సినిమా హీరోయిన్ సాయిపల్లవిపై ప్రశంసల వర్షం కురిపించారు. సాయిపల్లవి డ్యాన్స్ కు తాను అభిమానిని అని పేర్కొన్నారు. ఫిదా సినిమాలో తమ వరుణ్ తేజ్ తో సాయిపల్లవి నటించిందని చెప్పారు. ఆ సినిమాలో ఓ పాటలో సాయిపల్లవి డ్యాన్స్ తనను ముగ్ధుడ్ని చేసిందని చెప్పారు.

"ఆ పాటను చూస్తున్న సమయంలో వరుణ్ వచ్చాడు. డాడీ... నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నాడు. సారీరా వరుణ్... నేను సాయిపల్లవిని చూస్తున్నా అని చెప్పాను. నా కొత్త చిత్రంలో ఓ చెల్లెలి పాత్ర ఉంది. సాయిపల్లవిని ఆ పాత్రకు అనుకున్నాం. ఆమె ఒప్పుకోకపోతే బాగుండును అని మనసులో అనుకున్నాను. ఎందుకుంటే సాయిపల్లవి వంటి అమోఘమైన డ్యాన్సర్ తో చెల్లెలి పాత్ర వేయించడం ఎందుకు అనుకున్నాను. ఎప్పటికైనా సాయిపల్లవితో ఓ డ్యాన్స్ సాంగ్ చేయాలనుకుంటున్నా. రాధ, రంభ, శ్రీదేవి వంటి హీరోయిన్లు అద్భుతమైన డ్యాన్సర్లు... వారందరితో నేను డ్యాన్స్ చేశాను. ఇప్పుడు సాయిపల్లవితో కూడా డ్యాన్స్ చేస్తే వచ్చే కిక్ ను ఆస్వాదించాలనుకుంటున్నా" అని పేర్కొన్నారు.

కాగా, లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ కూడా హాజరయ్యారు. చిరంజీవి స్పీచ్ మ్తొతంలో సాయిపల్లవి ఎపిసోడ్ తనకు బాగా నచ్చిందని ఆమిర్‌ వెల్లడించారు.