BCCI: టీమిండియాకు కొత్త కోచ్‌?.. నో చెప్పిన శ్రీలంక దిగ్గజం!

  • టీ20 ప్రపంచ కప్ తర్వాత రవిశాస్త్రి తప్పుకునే అవకాశం?
  • ద్రవిడ్, సెహ్వాగ్‌ పేర్లపై కొంతకాలం చర్చ
  • ఇప్పుడు తెరమీదకు శ్రీలంక దిగ్గజం జయవర్దనే పేరు
  • సున్నితంగా తిరస్కరించాడంటూ వార్తలు
Srilanka former batsment rejects BCCI offer to be team india head coach

వచ్చే టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని టీమిండియా సారధి కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా తన పదవికి వీడ్కోలు చెప్పేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జట్టు కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వెతుకులాట ప్రారంభించినట్లు సమాచారం.

నిన్నమొన్నటి వరకూ భారత మాజీలైన ద్రవిడ్, సెహ్వాగ్‌లలో ఒకరికి ఈ ఛాన్స్ దొరకబోతోందని వార్తలు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా తెరమీదకు శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరు వచ్చింది. కొన్నిరోజుల క్రితం టీమిండియా హెడ్ కోచ్ ఆఫర్‌ను జయవర్దనే ముందు ఉంచిందట బీసీసీఐ. అయితే దీన్ని జయవర్దనే సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శ్రీలంక అండర్-19 జట్టుకు సలహాదారుగా జయవర్దనే ఉన్నాడు. ఈ క్రమంలో భారత కోచ్ పదవిపై జయవర్దనే ఆసక్తి కనబరచడం లేదని సమాచారం. శ్రీలంక ప్రధాన కోచ్‌గా ఉండటానికే జయవర్దనే మొగ్గు చూపుతున్నట్లు కొందరు అంటున్నారు.

అదే సమయంలో ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు జయవర్దనే కోచ్‌గా ఉన్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం టీమిండియా కోచ్‌గా ఉన్న వ్యక్తి మరే జట్టుకూ కోచ్‌గా ఉండకూడదు. ప్రస్తుతం జయవర్దనేను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ జట్టు కూడా సుముఖంగా లేదని తెలుస్తోంది.

అదే సమయంలో శ్రీలంక క్రికెట్‌లో ఇలాంటి నిబంధనలు లేవు. కాబట్టే జయవర్దనే ఈ ఆఫర్ తిరస్కరించాడని వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే టీ20 ప్రపంచకప్ ముగిసే వరకూ ఆగాల్సిందే.

More Telugu News