రష్యా, అమెరికా పర్యటనకు భారత ఆర్మీ చీఫ్

19-09-2021 Sun 18:03
  • సీడీఎస్ హోదాలో తొలి విదేశీ పర్యటన
  • షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల సీడీఎస్ స్థాయి అధికారుల సమావేశం
  • చైనా, పాకిస్థాన్ కూడా ఈ బృందంలోనే
Indian CDC Rawat to visit Russia and USA

భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీడీఎస్) పదవిని చేపట్టిన తర్వాత రావత్ వెళుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ పర్యటనలో ఆయన అమెరికా, రష్యా దేశాలకు వెళుతున్నట్లు తెలుస్తోంది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్యదేశాల సీడీఎస్ స్థాయి అధికారుల సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ తర్వాత రష్యాలో జరిగే ఎస్‌సీవో శాంతి మిషన్ డ్రిల్స్‌లో భారత దళాలు పాలుపంచుకుంటాయి. భారత ఆర్మీ, వాయుసేనలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనికోసం వచ్చే వారమే రష్యా పర్యటనకు బిపిన్ రావత్ వెళ్లనున్నట్లు సమాచారం.

రష్యా నుంచి తిరిగొచ్చిన వెంటనే ఆయన అమెరికా బయలుదేరతారు. అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు. గడిచిన కొన్నేళ్లలో భారత్-అమెరికా మధ్య మిలటరీ బంధాలు బలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల దళాలు కలిసి పలు ఆర్మీ విన్యాసాల్లో కూడా పాలుపంచుకున్నాయి.

కాగా, కొంతకాలంగా దేశంలోని త్రివిధ దళాల మధ్య సమన్వయం తీసుకొచ్చే బాధ్యతలతో బిపిన్ రావత్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనలకు వెళ్లకుండా వాయిదాలు వేస్తూ వచ్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.