సమయం లేదు మిత్రమా.. మహావిపత్తు అంచున భూమి: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

19-09-2021 Sun 14:23
  • శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతల్లో 2.7 డిగ్రీలు పెరుగుదల
  • పారిస్ ఒప్పందానికి రెట్టింపు
  • జీవరాశికి పెను విపత్తు అన్న యూఎన్ చీఫ్
Running Out Of Time Says UN Chief Citing UN Report On Global Warming

భూగ్రహం మహావిపత్తుకు అంచున ఉందా? అంటే అవుననే ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక హెచ్చరిస్తోంది. యూఎన్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ భూతాపానికి సంబంధించి తాజా నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరుగుతాయని హెచ్చరించింది. అయితే, భూతాపాన్ని తగ్గించాలంటే ఉష్ణోగ్రతల సగటు పెరుగుదలను 1.5 డిగ్రీల లోపే ఉండేలా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు.

ఈ నివేదికను చూస్తుంటే భూమి మహావిపత్తు వైపు శరవేగంగా దూసుకుపోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరగడమంటే విపత్తేనని అన్నారు. 1.5 డిగ్రీల దగ్గరే ఉంచుతామని ఆరేళ్ల క్రితం పారిస్ ఒప్పందం హామీ గాల్లో కలిసిపోయినట్టేనని ఆవేదన చెందారు. లక్ష్యాన్ని అందుకోలేకపోతే భూమ్మీద జీవరాశి వినాశనానికి దారి తీస్తుందని ఆందోళన చెందారు. ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి మన దగ్గర అన్ని ఆయుధాలున్నా.. సమయం మాత్రం వేగంగా కరిగిపోతోందని చెప్పారు.