కేసీఆర్ చేతిలో బీజేపీ రిమోట్: రేవంత్‌రెడ్డి

19-09-2021 Sun 09:13
  • సెప్టెంబరు 17ను బీజేపీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటోంది
  • మోదీ బర్త్ డే నాడు తెలంగాణకు ఏమిచ్చారు?
  • కేసీఆర్ అవినీతిపై షాకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు
BJP Remote is in KCR Hand alleged Revanth Reddy
తెలంగాణలో బీజేపీ రిమోట్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉందని, ఆయన నొక్కినట్టే ఆ పార్టీ ఆడుతోందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినాన్ని అడ్డంపెట్టుకుని రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. సోనియా తన పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 9న తెలంగాణను ప్రకటించారని, మరి మోదీ పుట్టినరోజున రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలకు ఏమిచ్చారని ప్రశ్నించారు.

160 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనను 70 సంవత్సరాల క్రితం జరిగినట్టు చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని పదే పదే విమర్శిస్తున్న బండి సంజయ్, అర్వింద్‌లు అమిత్ షాకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలను విజయవంతం చేసినందుకు నాయకులు, కార్యకర్తలకు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.