'డేగల బాబ్జీ'గా బండ్ల గణేశ్ ఫస్టులుక్!

17-09-2021 Fri 18:00
  • హీరోగా బండ్ల గణేశ్
  • తాజాగా టైటిల్ ఖరారు
  • దర్శకుడిగా వెంకట్ చంద్ర పరిచయం
  • ఆల్ ది బెస్ట్ చెప్పిన హరీశ్ శంకర్  
Degala Babji first look released

బండ్ల గణేశ్ ఒక చిన్న నటుడిగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ తరువాత నిర్మాతగా ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. ఆయన ఖాతాలో భారీ సినిమాలు .. భారీ విజయాలు కనిపిస్తాయి. కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన, హీరోగా తెరపై ప్రత్యక్షం కానున్నాడు.

ఆయన హీరోగా వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన సినిమా చాలా ఫాస్టుగా చిత్రీకరణ జరుపుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఆ సినిమాకి 'డేగల బాబ్జీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్టులుక్ ను వదిలారు.

దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా ఈ ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేయించారు. 'గబ్బర్ సింగ్' సినిమా నుంచి హరీశ్ శంకర్ - బండ్ల గణేశ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గణేశ్ ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్ చేసిన హరీశ్ శంకర్, ఆయనతో పాటు ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.