ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... కీలక నిర్ణయాలు ఇవిగో!

16-09-2021 Thu 15:47
 • సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ
 • ముగిసిన సమావేశం
 • పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
 • మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్
 • క్యాబినెట్ భేటీ వివరాల వెల్లడి
AP Cabinet meet details

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. హౌసింగ్ కార్పొరేషన్ వద్ద ఇళ్లు కుదువపెట్టిన వారి కోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు.

1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం పొందిన పేదలు  రుణం కోసం హౌసింగ్ కార్పొరేషన్ వద్ద తనఖా పెట్టి తీసుకున్న అప్పు అసలు రూ.9,320 కోట్లు కాగా, దానికి ఇప్పటివరకు వడ్డీ రూ.5,289 కోట్లు అని వివరించారు. ఈ రుణాన్ని వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా పరిష్కరించి పేదలకు లబ్ది చేకూర్చాలని సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.

ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన అంశాలు...

 • ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమ తొలగించేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం.
 • ప్రమాద రహిత, పర్యావరణ అనుకూల పరిశ్రమ స్థాపించేందుకు ఎల్జీ పాలిమర్స్ కు అనుమతి.
 • మైనారిటీ సబ్ ప్లాన్ కు కూడా మంత్రివర్గం ఆమోదం.
 • రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నియామకం చట్టసవరణకు మంత్రివర్గ ఆమోదం.
 • కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి)తో కలిసి సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు.
 • సెకీతో కలిసి 10 వేల మెగావాట్ల ప్లాంట్.
 • ఈ 10 వేల మెగావాట్లు వ్యవసాయ రంగానికే వినియోగించాలని నిర్ణయం.
 • యూనిట్ రూ.2.49 చొప్పున సరఫరా చేసేందుకు క్యాబినెట్ ఆమోదం.
 • రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్టీసీకి బదలాయించేందుకు ఆమోదం.
 • వైఎస్సార్ ఆసరా పథకానికి క్యాబినెట్ ఆమోదం.
 • గృహ నిర్మాణానికి రూ.35వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి ఆమోదం.