బ్యాంకులో సాంకేతిక లోపం.. స్కూలు విద్యార్థి ఖాతాలో 900 కోట్లు!

16-09-2021 Thu 15:14
  • బిహార్‌లో ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో కనిపిస్తున్న నగదు
  • ఏటీయంకు బారులు తీరిన ప్రజలు
  • కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి ఖాతాలో 5 లక్షలు జమ
school boy account credited with 900 cr in Bihar
స్కూలు యూనిఫాం తదితర వస్తువులు కొనుక్కోవడం కోసం ఒక ప్రభుత్వ స్కీంకు దరఖాస్తు చేసుకున్నారు ఇద్దరు విద్యార్థులు. అయితే అనూహ్యంగా వారి ఖాతాల్లో కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు తమకు కూడా అలాంటి అదృష్టం పట్టిందేమో అని చూసుకోవడానికి ఏటీయం ముందు బారులు తీరారు. ఈ దృశ్యం బిహార్‌లోని కటిహార్‌లో వెలుగు చూసింది.

సదరు విద్యార్థులిద్దరికీ ఉత్తర బిహార్ గ్రామీణ బ్యాంకులో ఖాతాలున్నాయి. ఇద్దరూ కూడా యూనిఫాం తదితర వస్తువులు కొనుక్కోవడం కోసం ఒక ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ డబ్బు తమ ఖాతాలో చేరిందా? అని ఇంటర్నెట్‌లో చెక్ చేస్తే ఒక విద్యార్థి ఖాతాలో రూ.6.2 కోట్లు జమ అయినట్లు కనిపించింది. మరో విద్యార్థి ఖాతాలో ఏకంగా రూ.900 కోట్లు జమైనట్లు తెలిసింది.

ఈ విషయం తెలిసిన బ్యాంకు మేనేజర్ ఘటనపై స్పందించారు. బ్యాంకు సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని ఆయన చెప్పారు. నిజానికి సదరు విద్యార్థుల ఖాతాల్లో డబ్బు లేదని, కానీ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో మాత్రం అంత సొమ్ము ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు.

కాగా, పాట్నా పరిసరాల్లో నివసించే ఒక వ్యక్తి ఖాతాలో ఈ ఏడాది మార్చిలో రూ.5 లక్షలు జమయ్యాయి. ఇవి తనకు మోదీ ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బు అని భావించిన అతను ఆ మొత్తాన్ని ఖర్చుపెట్టేశాడు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.