భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు

14-09-2021 Tue 20:54
  • ఆరుగురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు
  • వారిలో ఇద్దరు పాక్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు
  • దేశంలో అలజడి సృష్టించాలని ప్లాన్
  • అరెస్టయిన వారి నుంచి పేలుడు పదార్థాల స్వాధీనం
Delhi police busted huge terror plot

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులు సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిని ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీస్థాయిలో పేలుడు పదార్థాలు, ల్యాండ్ మైన్లు, మందుగుండు, పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదుల పేర్లు ఒసామా, జీషన్ అని, వారు పాకిస్థాన్ లో శిక్షణ పొందినవారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో భారీ పేలుళ్లతో విధ్వంసానికి వీరు కుట్ర పన్నారని వెల్లడించారు. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలో ఐఈడీల సాయంతో అలజడి సృష్టించాలన్నది వీరి ప్రణాళిక అని ఢిల్లీ పోలీస్ విభాగం స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహా వెల్లడించారు. ఒసామా, జీషన్ పాకిస్థాన్ ఐఎస్ఐ ఆదేశాలతో పనిచేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.