వాడిని ఎన్ కౌంటర్ చేయాల్సిందే: మంత్రి మల్లారెడ్డి

14-09-2021 Tue 17:01
  • ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగుడు
  • నిందితుడిని కచ్చితంగా ఎన్ కౌంటర్ చేస్తామన్న మల్లారెడ్డి
  • త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని వ్యాఖ్య
Will encounter rapist says minister Malla Reddy

హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిందితుడి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. మరోవైపు ఆ చిన్నారి కుటుంబసభ్యులను రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నేతలతో పాటు సినీ నటుడు మంచు మనోజ్ కూడా పరామర్శించారు.
 
ఈ హత్యాచార ఘటనపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాల్సిందేనని చెప్పారు. నిందితుడిని పట్టుకుని కచ్చితంగా ఎన్ కౌంటర్ చేస్తామని అన్నారు. త్వరలోనే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తామని చెప్పారు.