Manchu Manoj: ఇలాంటి దారుణమైన లోకంలో బతుకుతున్నందుకు బాధగా ఉంది: మంచు మనోజ్

  • హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం
  • ఇదొక క్రూరమైన చర్య అన్న మనోజ్
  • ఇలాంటి రాక్షసులకు 24 గంటల్లో ఉరిశిక్ష విధించాలని వ్యాఖ్య
Feeling sad to live in this society says Manchu Manoj

హైదరాబాద్, సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక హత్యాచారానికి గురైన ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. ఈ దారుణానికి పాల్పడిన దుండగుడిని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు. మరోవైపు చిన్నారి కుటుంబసభ్యులను సినీ నటుడు మంచు మనోజ్ ఈరోజు పరామర్శించారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరేళ్ల బాలికపై ఇలాంటి దారుణానికి పాల్పడటం క్రూరమైన చర్య అని అన్నారు. ఇలాంటి క్రూరమైన సమాజంలో బతుకుతున్న మనమంతా బాధ్యతాయుతంగా ఉండాలని... ఆడపిల్లలను ఎలా గౌరవించాలో ప్రతి ఒక్కరికీ నేర్పించాలని చెప్పారు.

నిందితుడి జాడ దొరకలేదని పోలీసులు చెపుతున్నారని మనోజ్ అన్నారు. దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చత్తీస్ గఢ్ లో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ, ఏడాది తర్వాత కోర్టు తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు.

అసలు ఇలాంటి రాక్షసులకు 24 గంటల్లో ఉరిశిక్ష విధించాలని అన్నారు. ఇలాంటి దారుణమైన లోకంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని మనోజ్ చెప్పారు. పాపలేని లోటును తీర్చలేమని... కనీసం ఆ పాప కుటుంబానికైనా అండగా ఉందామని కోరారు. ఈ తరం నుంచైనా మగవాడి ఆలోచనా విధానం మారాలని అన్నారు.

More Telugu News