కుమారుడ్ని నీట్ పరీక్షకు పంపి హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న మెదక్ వైద్యుడు

12-09-2021 Sun 20:56
  • సితార హోటల్లో ఆత్మహత్య కలకలం
  • తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్న డాక్టర్ చంద్రశేఖర్
  • కేసు నమోదుచేసుకున్న పోలీసులు
  • చంద్రశేఖర్ పై గతంలో హత్య కేసు ఆరోపణలు
Medak doctor commits suicide in Hyderabad

మెదక్ లో ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆర్. చంద్రశేఖర్ అనే వైద్యుడు హైదరాబాదు, కేపీహెచ్బీలోని హోటల్ సితారలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవాళ నీట్ పరీక్ష జరగ్గా, కుమారుడ్ని నిజాంపేటలోని నీట్ పరీక్షా కేంద్రం వద్ద వదిలిపెట్టిన డాక్టర్ చంద్రశేఖర్ అనంతరం హోటల్ కు తిరిగొచ్చి బలవన్మరణం చెందారు. ఆయన ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

డాక్టర్ చంద్రశేఖర్ భార్య కూడా వైద్యురాలే. కుమారుడి నీట్ పరీక్ష కోసం ఇరువురు హైదరాబాద్ రాగా, ఓ ఎమర్జెన్సీ కేసు ఉండడంతో ఆమె మెదక్ వెళ్లిపోయారు.

ఇదిలావుంచితే, డాక్టర్ చంద్రశేఖర్ ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెంగళూరుకు చెందిన ఆయన తన భార్యతో కలిసి మెదక్ లో గత రెండు దశాబ్దాలుగా నర్సింగ్ హోం నిర్వహిస్తున్నారు. వైద్య వృత్తి మాత్రమే కాకుండా, రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆయన పెట్టుబడులు పెట్టారు. అయితే గత నెలలో మెదక్ జిల్లాలో ధర్మకారి శ్రీనివాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక డాక్టర్ చంద్రశేఖర్ హస్తం ఉందని ఆరోపణలు వినిపించాయి.