చచ్చిపోయాడనుకున్న అల్ ఖైదా చీఫ్ జవహరి మళ్లీ వచ్చాడు!

12-09-2021 Sun 17:29
  • లాడెన్ తర్వాత అల్ ఖైదా పగ్గాలు చేపట్టిన అల్ జవహరి
  • జవహరి మరణించాడని గతంలో ప్రచారం
  • అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు
  • ఓ వీడియోలో దర్శనమిచ్చిన జవహరి
Al Jawahari reappears on a video

అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హతమయ్యాక, ఆ ఉగ్రవాద సంస్థ బాధ్యతలు చేపట్టిన అల్ జవహరీ తెరపైకి వచ్చి చాన్నాళ్లయింది. అసలు, జవహరి ఎప్పుడో మరణించాడంటూ అంతర్జాతీయ మీడియా పలు సందర్భాల్లో పేర్కొంది. అనారోగ్యంతో మరణించాడని తెలిపింది. అయితే, అందరినీ విస్మయానికి గురిచేస్తూ, అల్ జవహరి తాజాగా ఓ వీడియోలో ప్రత్యక్షమయ్యారు.

అమెరికాలో అల్ ఖైదా చేపట్టిన 9/11 దాడులు జరిగి నిన్నటితో 20 ఏళ్లయిన సందర్భంగా అల్ ఖైదా అధికారిక మీడియా విభాగం ఈ వీడియోను పంచుకుంది. బాగా వయసు మీదపడినట్టుగా అల్ జవహరి ఈ వీడియోలో కనిపించారు. అయితే, ఈ వీడియోలో జవహరి ప్రసంగం ప్రధానంగా జెరూసలెం అంశాన్ని ప్రస్తావిస్తూ సాగింది. జెరూసలెంను ఎట్టిపరిస్థితుల్లోనూ యూదుల వశం కానివ్వబోమని ఉద్ఘాటించారు.

ఆఫ్ఘనిస్థాన్ భూభాగంపై ఏమీ చేయలేక చెల్లాచెదురైన అమెరికా ఎట్టకేలకు నిష్క్రమిస్తోందన్న అంశాన్ని ప్రస్తావించిన జవహరి, తాలిబన్లు పగ్గాలు చేపట్టిన అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అంతేకాదు, గత రెండేళ్ల కాలంలో వివిధ ఘటనల్లో మరణించిన ఉగ్రవాదులను పేరుపేరునా కొనియాడారు. ఈ వీడియో వ్యవహారాన్ని 'సైట్' అనే నిఘా సంస్థ వెలుగులోకి తీసుకువచ్చింది.