నటుడు సాయితేజ్‌కు ప్రమాదం జరిగినప్పుడు సాయం చేసింది ఈ ఇద్దరే!

12-09-2021 Sun 06:35
  • 108కి ఫోన్ చేసి సమాచారమిచ్చిన అబ్దుల్
  • అంబులెన్స్ వచ్చే వరకు ఉండి అందులోకి సాయితేజ్‌ను ఎక్కించిన వైనం
  • ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గోవింద్
These are the two people who helped actor Saitej when he had an accident

టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురై కిందపడి తీవ్ర గాయాలైన సమయంలో 108 నంబరుకు ఫోన్ చేసి సమాచారమిచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?.. సీఎంఆర్ సంస్థలో వ్యాలెట్ పార్కింగులో పనిచేస్తున్న అబ్దుల్. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన అబ్దుల్ నిజాంపేటలో పని ఉండడంతో కేబుల్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నారు. అదే సమయంలో సాయితేజ్ ప్రమాదానికి గురికావడంతో వెంటనే స్పందించిన ఆయన బైక్‌ను పక్కన నిలిపి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఆ తర్వాత కూడా అక్కడే ఉండి అంబులెన్స్ వచ్చాక సాయితేజ్‌ను అందులోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆసుపత్రికి కూడా వెళ్లారు.

అదే సమయంలో ప్రమాద సమయానికి కొద్ది దూరంలో పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ కూడా వెంటనే స్పందించారు. డయల్ 100 నుంచి ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న ఆయన ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడంలో తనవంతు పాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు.