Hardik Patel: గుజరాత్ రిమోట్ కంట్రోల్ ఢిల్లీ చేతుల్లో ఉందని స్పష్టమైంది: రూపానీ రాజీనామాపై కాంగ్రెస్ స్పందన

  • గుజరాత్ రాజకీయాల్లో సంచలనం
  • సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా
  • చేతగాని ప్రభుత్వం అంటూ హార్దిక్ పటేల్ విమర్శలు
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని వెల్లడి
Hardik Patel slams BJP Govt after Vijay Rupani resigned as Chief Minister

ఎవరూ ఊహించని విధంగా గుజరాత్ సీఎం పదవి నుంచి విజయ్ రూపానీ తప్పుకోవడంపై కాంగ్రెస్ స్పందించింది. గుజరాత్ రిమోట్ కంట్రోల్ ఢిల్లీ చేతుల్లో ఉందన్న విషయం ఈ పరిణామంతో స్పష్టమైందని గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ హార్దిక్ పటేల్ అన్నారు. గుజరాత్ లో ప్రభుత్వాన్ని నడపడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పేందుకు రూపానీ రాజీనామానే నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రూపానీ రాజీనామా ఓ ప్రయత్నం వంటిదని అభివర్ణించారు. ప్రస్తుత ప్రభుత్వ చేతకానితనాన్ని దాచిపెడుతున్నారని హార్దిక్ పటేల్ విమర్శించారు.

కరోనా సంక్షోభ సమయంలో ఈ ప్రభుత్వ అసమర్థత బయటపడిందని, ఆక్సిజన్ కొరత, శ్మశాన వాటికల వద్ద కనిపించిన ఘోర దృశ్యాలతో గుజరాత్ దుస్థితి యావత్ ప్రపంచం చూసిందని అన్నారు. మరోవైపు ద్రవ్యోల్బణంతో వ్యాపారులు తీవ్ర నష్టాల పాలయ్యారని, నిరుద్యోగిత పెచ్చరిల్లిందని, పరిశ్రమల మూసివేత కొనసాగుతోందని హార్దిక్ పటేల్ వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెంతకాలం గుజరాత్ ను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా పాలిస్తారు? ఇంకెంతకాలం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతారు? అని ప్రశ్నించారు. 2014 తర్వాత గుజరాత్ లో ఓ సీఎంను మార్చడం ఇదే ప్రథమం అని, కానీ అసలైన మార్పు వచ్చే ఏడాది ఎన్నికల్లో కనిపిస్తుందని, బీజేపీని ప్రజలు కూకటివేళ్లతో పెకలించివేయడం అప్పుడు చూస్తారని హార్దిక్ స్పష్టం చేశారు.

More Telugu News