సాయితేజ్... నువ్వు మునుపటిలా శక్తిమంతుడవై రావాలి: నారా లోకేశ్

11-09-2021 Sat 14:11
  • నిన్న హైదరాబాదులో రోడ్డు ప్రమాదం
  • తీవ్రంగా గాయపడిన హీరో సాయితేజ్
  • స్పందించిన నారా లోకేశ్ తదితరులు
  • వేగంగా కోలుకోవాలంటూ ట్వీట్
Nara Lokesh wishes Saitej a speedy recovery

మెగాహీరో సాయితేజ్ నిన్న హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సాయితేజ్ కోలుకుంటున్నాడని వైద్యులు తాజా బులెటిన్ లో తెలిపారు. కాగా, సాయితేజ్ క్షేమంగా ఉండాలంటూ అభిమానులు, సన్నిహితులు, ప్రముఖులు కోరుకుంటున్నారు.

ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సాయితేజ్ సత్వరమే కోలుకోవాలని, ఆరోగ్యవంతుడవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. "సాయితేజ్... నువ్వు మునుపటి ఉత్సాహం, తరగని శక్తితో తిరిగి రావాలని మేమందరం ప్రార్థిస్తున్నాం" అని ట్వీట్ చేశారు.

అటు, టీమిండియా క్రికెటర్ హనుమ విహారి కూడా స్పందించారు. అసలు, సాయితేజ్ యాక్సిడెంట్ ఫుటేజి చూస్తుంటే భయానకంగా ఉందని అన్నారు. అదృష్టం కొద్దీ సాయితేజ్ కు ప్రమాదమేమీలేదని తెలిపారు. బ్రదర్... నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం అని పేర్కొన్నారు.

కాగా, సాయితేజ్ ను ప్రమాదం జరిగిన వెంటనే మాదాపూర్ లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.