‘బిగ్‌బాస్’తో విష సంస్కృతి.. వెంటనే నిలిపేయండి: సీపీఐ నారాయణ

11-09-2021 Sat 07:12
  • బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నారాయణ
  • అదో బూతుల ప్రపంచమని, వేల కోట్ల రూపాయలకు ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం
  • న్యాయవ్యవస్థ, పోలీసులు తనకు సాయం చేయడం లేదని ఆవేదన
CPI Narayana fires on Bigg Boss TV Show

ఓ తెలుగు టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్’షోపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది సమాజంలో విష సంస్కృతిని పెంచేలా ఉందని దుయ్యబట్టారు. వెంటనే దీనిని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి షోలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తున్నాయని ప్రశ్నించారు. దీనివల్ల ఉపయోగం ఎవరికో చెప్పాలన్నారు. బిగ్‌బాస్ షో అంటేనే బూతుల ప్రపంచమని, దీనిని వేల కోట్ల రూపాయల వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిగ్‌బాస్ షోకు అనుమతి నివ్వడం చాలా ఘోరమైన విషయమన్నారు. ఈ షో అనైతికమన్నారు. దీనిని ఆపాలంటూ తాను కోర్టుల్లో కేసులు వేసినా న్యాయవ్యవస్థ కానీ, పోలీసులు కానీ తనకు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇలాంటి దారుణ షోలకు అనుమతినివ్వడం మానుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.