'మా' బిల్డింగ్ వివాదంపై స్పందించిన శివాజీరాజా

  • త్వరలో 'మా' ఎన్నికలు
  • వివాదం రూపు దాల్చిన 'మా' బిల్డింగ్ అంశం
  • తొలుత ఈ అంశాన్ని ప్రస్తావించిన మోహన్ బాబు
  • ఘాటు వ్యాఖ్యలు చేసిన నాగబాబు
  • వివరణ ఇచ్చిన శివాజీరాజా
Sivaji Raja explains controversial building issue

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) బిల్డింగ్ కొనుగోలు, అమ్మకం వ్యవహారంపై మోహన్ బాబు, నాగబాబుల వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ అంశం వివాదం రూపుదాల్చిన నేపథ్యంలో 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీరాజా స్పందించారు. ఆ బిల్డింగ్ అమ్మింది తన హయాంలోనే అని వెల్లడించారు. అయితే అది బంగ్లా కాదని, డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అని, పైగా అది పెంట్ హౌస్ అని తెలిపారు.

"అమ్మకానికి ఫ్లాట్" అంటూ ప్రకటనలు ఇచ్చినా స్పందనలేకపోవడంతో చివరికి 'మా'కు సేవలు అందించిన శ్రీధర్ కు ఆ ఫ్లాట్ అమ్మేశామని వివరించారు. ఆ ఫ్లాట్ కొన్న శ్రీధర్ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని శివాజీరాజా పేర్కొన్నారు. ఆ పెంట్ హౌస్ ఉన్న అపార్ట్ మెంట్ లోనే దర్శకుల సంఘం, రచయితల సంఘం కార్యాలయాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. సినీ రంగానికి చెందిన కార్యాలయాలు ఉండడంతో తమ కార్యాలయం కూడా అక్కడే ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నాగబాబు నాడు ఆ పెంట్ హౌస్ ను కొనుగోలు చేసి ఉండొచ్చని శివాజీరాజా వివరించారు.

"నాగబాబు హయాంలో ఎంత నిజాయతీతో ఆ ఫ్లాట్ కొన్నారో, నేను అధ్యక్షుడిగా, నరేశ్ కార్యదర్శిగా ఉన్న సమయంలో అంతే నిజాయతీతో అమ్మేశాం" అని స్పష్టం చేశారు. ఆ ఫ్లాట్ కు సింగిల్ గోడ, కింద మురికి కాలువ వంటి అనేక ప్రతికూలతలు ఉండడంతో అమ్మాలని పలువురు పెద్దలు కూడా సూచించారని తెలిపారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే తనను అడగొచ్చని సూచించారు.

అంతకుముందు  మోహన్ బాబు ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే నాగబాబు హయాంలో బిల్డింగ్ కొన్నారంటూ తన పేరును ప్రస్తావిస్తుండడంతో నాగబాబు ఘాటుగా స్పందించారు. మరోసారి తనపై వ్యాఖ్యలు చేస్తే తన స్పందన తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. రూ.90 లక్షల విలువ చేసే భవనాన్ని రూ.30 లక్షలకే అమ్మారని, దీని వెనుక కారణమేంటన్నది నాటి మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేశ్ లనే అడగాలని నాగబాబు పేర్కొన్నారు.

More Telugu News