దీపావళి పండుగ పైనే దృష్టి పెట్టిన 'ఆచార్య'

09-09-2021 Thu 11:51
  • షూటింగు పూర్తి చేసుకున్న 'ఆచార్య'
  • వేగంగా జరుగుతున్న నిర్మాణానంతర పనులు
  • మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  • ఆకట్టుకోనున్న రెజీనా ఐటమ్ సాంగ్    
Acharya movie update

చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందింది. నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. చిరూ - చరణ్ ఇద్దరూ కూడా ఒక ఆశయం కోసం పోరాడే నక్సలైట్లుగా కనిపించనున్నారు.

చరణ్ పోషించిన 'సిద్ధా' పాత్ర ఆయన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీపావళి పండుగ సందర్భంగా నవంబర్లోనే విడుదల చేయాలనే ఒక ఆలోచనలో మేకర్స్ ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.

భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా నుంచి వచ్చిన 'లాహే .. లాహే ..' సాంగ్ జనంలోకి దూసుకుపోయింది. త్వరలోనే మరో సింగిల్ ను వదిలే అవకాశం ఉందని అంటున్నారు. ఇక చరణ్ - పూజ హెగ్డేపై చిత్రీకరించిన యుగళగీతం .. చిరూ కాంబినేషన్లో చిత్రీకరించిన రెజీనా ఐటమ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెబుతున్నారు.