Andhra Pradesh: కావాలనే ఆలస్యం చేస్తున్నారు.. హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్యే పిటిషన్​ పై ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదన

  • కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకోవడంపై పిటిషన్ వేసిన రామకృష్ణ
  • కేంద్రం, కాగ్, ఆర్బీఐని ఇంప్లీడ్ చేయాలని విజ్ఞప్తి
  • అందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం
  • విచారణ నాలుగు వారాలు వాయిదా
  • విశాఖ ఉక్కు పరిశ్రమపైనా విచారణ
AP High Courts Postponed Hearing On Pleas

కార్పొరేషన్ ద్వారా రుణ సేకరణ, విశాఖ ఉక్కు పరిశ్రమపై దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ విచారించింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం రుణాలను తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. కేసులో కేంద్రం, ఆర్బీఐ, కాగ్ సహా మరో 5 బ్యాంకులను ఇంప్లీడ్ చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు.

అయితే, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్ కావాలనే విచారణను ఆలస్యం చేస్తున్నారని కోర్టుకు చెప్పారు. పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కావాలని కోరడంతో.. కోర్టు విచారణను వాయిదా వేసింది.

విశాఖ ఉక్కు పరిశ్రమపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మరో వ్యక్తి వేసిన రెండు పిటిషన్లను కోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటర్ పై వివరణ ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది రెండు వారాల గడువు కోరడంతో.. విచారణను వాయిదా వేసింది.

More Telugu News