ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల తీరుపై వ‌రుస‌గా అజిత్ దోవ‌ల్ స‌మావేశాలు.. నిన్న అమెరికాతో, నేడు ర‌ష్యా అధికారుల‌తో భేటీ

08-09-2021 Wed 12:13
  • ఢిల్లీలో భార‌త్, ర‌ష్యా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల‌ బృందం భేటీ  
  • ర‌ష్యా ఎన్ఎస్ఏ నికోలాయ్ పాత్రుషెవ్‌తో అజిత్ దోవ‌ల్ చ‌ర్చ‌లు
  • నిన్న  సీఐఏతో అజిత్ దోవ‌ల్‌ స‌మావేశం
  • ఆఫ్ఘ‌న్ ప‌రిస్థితుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి
ajit doval meets russias counterpart

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో చోటు చేసుకుంటోన్న ప‌రిణామాలు, తాలిబ‌న్ల తీరుపై జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు అజిత్ దోవల్ వ‌రుసగా ప‌లు దేశాల అధికారుల‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు. నేడు ఢిల్లీలో భార‌త్, ర‌ష్యా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల‌ బృందం స‌మావేశ‌మైంది.

ర‌ష్యా ఎన్ఎస్ఏ నికోలాయ్ పాత్రుషెవ్‌తో అజిత్ దోవ‌ల్ బృందం చ‌ర్చిస్తోంది. నిన్న కూడా అమెరికాకు చెందిన సీఐఏ అధికారులతో అజిత్ దోవ‌ల్ స‌మావేశ‌మై ఆఫ్ఘ‌న్‌లో తాజా ప‌రిణామాలపై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆఫ్ఘ‌న్‌లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో, అక్కడ చోటు చేసుకుంటోన్న ప‌రిణామాలు, భ‌విష్య‌త్తులో పొంచి ఉన్న ముప్పు వంటి అంశాల‌పై భారత్ అప్ర‌మ‌త్త‌మైంది.

దీనిపై చ‌ర్చించేందుకు నిన్న‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మరోసారి స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలోనూ అజిత్ దోవ‌ల్ పాల్గొన్నారు. ఆఫ్ఘ‌న్‌లో ప‌రిస్థితుల‌పై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. తాలిబన్ల నాయకత్వంపై అనుసరించాల్సిన వ్యూహాల‌పైనే ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది.