EngvsInd: ఓవల్ విజయం తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఇదీ సందడి

  • తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైన భారత్
  • తేరుకొని ఇంగ్లండ్‌పై 157 పరుగుల విజయం
  • విజయంపై ఆటగాళ్ల స్పందన
  • వీడియో షేర్ చేసిన బీసీసీఐ
BCCI shares unseen visuals and reactions afte Oval Win

ఇంగ్లండ్‌లోని ‘ది ఓవల్’ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్సులో 191 పరుగులకే ఆలౌటయిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్సులో పట్టుదలతో ఆడి ఆతిథ్య జట్టుపై 157 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మైదానంలో గడిచిన 50 ఏళ్లలో భారత జట్టు గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే ఓవల్ విజయం తర్వాత భారత డ్రెస్సింగ్ రూం చాలా సందడిగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ట్విట్టర్‌లో పంచుకుంది. ‘‘చారిత్రాత్మక విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి మీరు చూడని దృశ్యాలు, స్పందనలు తీసుకొచ్చాం’’ అంటూ ఈ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.

ఈ వీడియోలో పేసర్ ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ ఫ్లాట్‌గా ఉందని తెలుసు. కాబట్టి ఐదవ రోజు చాలా కష్టపడాలి. అందుకే మంచి లెంగ్త్‌లో బంతులు విసిరి పరుగులు కట్టడి చేయడం కోసం ప్రయత్నించాం. అలా చేస్తే వికెట్లు కచ్చితంగా పడతాయని మాకు తెలుసు’’ అని చెప్పాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఉమేష్ 6 వికెట్లు కూల్చిన సంగతి తెలిసిందే.

అలాగే నాలుగో టెస్టులో అందరి దృష్టినీ ఆకర్షించిన మరో ఆటగాడు శార్దూల్ ఠాకూర్. అతను మాట్లాడుతూ.. ‘‘నేను ఆడుతున్నానని తెలిసిన రోజే అనుకున్నా ఈ మ్యాచ్‌లో ప్రభావం చూపాలని. జట్టు విజయానికి ఉపయోగపడే పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నా’’ అని తెలిపాడు.

పోతే, ఇక మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు సిరీసులో చివరిదైన ఐదో టెస్టులో తలపడనున్నాయి. ఇది సెప్టెంబరు 10న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

More Telugu News