కూర బాగోలేదన్నాడని.. భర్త తల పగలగొట్టిన భార్య!

07-09-2021 Tue 18:57
  • హర్యానాలోని హిసార్‌లో ఘటన
  • కూరలో ఉప్పు తక్కువైందన్న భర్త దినేష్
  • కోపంతో ఇనుప రాడ్డుతో తల పగలగొట్టిన భార్య బిందియా
wife attacks husband for saying her food is not good
భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ ఇలాంటి వాగ్వాదం ప్రాణాల మీదకు తెస్తే? హర్యానాలోని హిసార్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. బార్వాలా సిటీలో దినేష్ (40), బిందియా దంపతులు ఉంటున్నారు. వీళ్ల మధ్య అప్పుడప్పుడూ చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ రోజు భార్య చేసిన కూరలో ఉప్పు తక్కువైందని దినేష్ భావించాడు.

అదే విషయం భార్యకు చెప్పి, భోజనం అసలు రుచిగా లేదని విసుక్కున్నాడు. అంతే.. వారిద్దరి మధ్య వాగ్వాదం పెద్దదయిపోయింది. ఎంతలా అంటే కోపంతో ఊగిపోయిన బిందియా.. ఇంట్లో ఉన్న ఒక ఇనుప రాడ్డు తీసుకొచ్చి దినేష్ తల పగలగొట్టింది. ఈ ఘటనను చూసిన పొరుగింటి వాళ్లు వెంటనే ముందుకొచ్చి దినేష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం తన భార్యపై పోలీసులకు దినేష్ ఫిర్యాదు చేశాడు. తమ మధ్య ఇలాంటి గొడవలు తరచూ జరుగుతుంటాయని పేర్కొన్నాడు.