Panjshir: ఆప్ఘ‌నిస్థాన్‌లోని పంజ్‌షీర్‌ మొత్తాన్ని అధీనంలోకి తెచ్చుకున్నాం: తాలిబ‌న్ల ప్ర‌క‌ట‌న‌

  • ఇన్నాళ్లు పంజ్‌షీర్‌లోకి ప్రవేశించ‌లేక‌పోయిన తాలిబ‌న్లు
  • ఇప్పుడు అహ్మ‌ద్ మ‌సూద్ మేన‌ల్లుడు అబ్దుల్ మృతి చెందాడ‌ని ప్ర‌క‌ట‌న
  • ప‌లువురు ముఖ్య‌నేత‌లూ హ‌త‌మ‌య్యార‌న్న తాలిబ‌న్లు
  • అమ్రుల్లా సలేహ్ వేరే సుర‌క్షిత ప్రాంతానికి ప‌రారీ
Taliban claim Panjshir Valley completely captured

ఆప్ఘ‌నిస్థాన్‌లోని పంజ్‌షీర్‌ ప్రావిన్స్ మొత్తాన్ని త‌మ అధీనంలోకి తెచ్చుకున్నామ‌ని తాలిబ‌న్లు తాజాగా ప్ర‌క‌టించారు. ఇన్నాళ్లు పంజ్‌షీర్‌లోకి తాలిబ‌న్లు ప్ర‌వేశించ‌లేక‌పోయిన విష‌యం తెలిసిందే. పంజ్‌షీర్‌లోని ప్రతిఘటన ద‌ళం, ప్ర‌జ‌లు చేస్తోన్న పోరాట ఫ‌లితంగా తాలిబ‌న్ల‌కు ఇన్నాళ్లూ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయి.  

అయితే, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామ‌ని తాలిబ‌న్లు చెప్పుకొంటున్నారు. అంతేగాక‌, అహ్మ‌ద్ మ‌సూద్ మేన‌ల్లుడు అబ్దుల్ తో పాటు ప‌లువురు ముఖ్య‌నేత‌లు మృతి చెందార‌ని ప్ర‌క‌టించారు. తాలిబ‌న్ల దాడి నేప‌థ్యంలో ప్రతిఘటన బృందం నాయ‌కుడు, ఆఫ్ఘ‌నిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ వేరే సుర‌క్షిత ప్రాంతానికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అమ్రుల్లా సలేహ్ వేరే ప్రాంతానికి వెళ్లిపోవ‌డంతో ఆయ‌న బ‌తికిపోయిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న ఇంటిపై తాలిబ‌న్లు దాడికి పాల్ప‌డ్డారు.

పంజ్‌షీర్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించామంటూ తాలిబన్లు ఇటీవ‌ల ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టికీ పంజ్‌షీర్ ద‌ళ స‌భ్యులు మాత్రం ఆ వార్త‌ల‌ను ఖండించారు. ఇప్పుడు పంజ్‌షీర్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. పంజ్‌షీర్ ఆక్ర‌మ‌ణ‌లో తాలిబ‌న్ల‌కు ఇత‌ర ఉగ్ర‌మూక‌లు కూడా స‌హ‌క‌రించిన‌ట్లు తెలుస్తోంది.

పంజ్‌షీర్‌లో విజ‌యంతో ఇక ఆఫ్ఘ‌నిస్థాన్ మొత్తం త‌మ హ‌స్త‌గ‌త‌మైంద‌ని తాలిబ‌న్ ప్ర‌తినిధి జాబిహుల్లా ముజాహిద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అక్క‌డి మందుగుండు సామ‌గ్రి, ఆయుధాల‌న్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు.

More Telugu News