ఇద్దరు యువతులను ప్రేమించిన యువకుడు.. లాటరీ తీసి ఒక అమ్మాయితో పెళ్లి చేసిన గ్రామ పెద్దలు

Triangle love story ends with lottery
  • ఇంటర్నెట్ సాయంతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ
  • ఇద్దరూ గ్రామానికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి
  • విషం తాగిన ఓ యువతి
  • లాటరీలో ఆమె పేరే రావడంతో పెళ్లి
  • వెళ్తూవెళ్తూ వదిలిపెట్టబోనని ప్రియుడిని హెచ్చరించిన మరో యువతి
ఓ యువకుడు ఇంటర్నెట్ ద్వారా ఇద్దరు అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు. అతడంటే విపరీతమైన ప్రేమ పెంచుకున్న ఆ ఇద్దరు యువతులు గ్రామానికి చేరుకోవడంతో యువకుడి బాగోతం బయటపడింది. తనను పెళ్లి చేసుకోవాలంటే తనను చేసుకోవాలంటూ ఇద్దరూ పట్టుబట్టడంతో విషయం గ్రామ పెద్దల దృష్టికి చేరింది. దీంతో ఏం చేయాలో పాలుపోని గ్రామస్థులు చివరికి లాటరీ తీసి ఒక అమ్మాయితో వివాహం జరిపించారు.

 కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగిందీ ఘటన. సకలేశపుర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఇంటర్నెట్ సాయంతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువతులను ప్రేమించాడు.  ఈ క్రమంలో అతడిని పెళ్లి చేసుకోవాలని యువతులిద్దరూ భావించి గ్రామానికి వచ్చారు. దీంతో యువకుడు తనను కాకుండా మరొకరిని ప్రేమిస్తున్న విషయం యువతులు ఇద్దరికీ తెలిసింది. దీంతో ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న సమస్య గ్రామ పెద్దల ముందుకు చేరింది.

మరోవైపు, అతడు లేకుంటే తాను బతకలేనంటూ ఓ యువతి విషం తాగింది. దీంతో గ్రామస్థులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కోలుకున్న ఆమె తాజాగా మరోమారు గ్రామానికి వచ్చింది. దీంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో బాగా ఆలోచించిన గ్రామ పెద్దలు ఓ మార్గాన్ని కనిపెట్టారు. ఇద్దరి పేర్లను లాటరీ తీసి ఎవరి పేరు వస్తే వారే అతడిని పెళ్లి చేసుకోవాలని, పేరు రాని యువతి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని షరతు విధించారు. ఇందుకు యువతులిద్దరూ అంగీకరించారు.

ఇక లాటరీ తీయగా విషం తాగి ఆసుపత్రి పాలైన యువతి పేరు వచ్చింది. దీంతో శుక్రవారం ఆమెతో యువకుడి వివాహం జరిపించారు. మరోవైపు, లాటరీలో ఓడిపోయిన యువతి వారికి శుభాకాంక్షలు చెబుతూనే, తనను మోసం చేసిన ప్రియుడిని వదిలిపెట్టబోనని హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ముక్కోణపు ప్రేమ కథ గురించి గ్రామస్థులు తాజాగా వెల్లడించడంతో వెలుగులోకి వచ్చింది.
Go Back to Shorts
Karnataka
Triangle Love Story
Hassan
Lottery

More Telugu News